Kodi Juttu Aku : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. కానీ అన్ని మొక్కల గురించి మనకు తెలియదు. కాకపోతే ఆయుర్వేద పరంగా ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి. కానీ ఆయుర్వేద మొక్కల గురించి కూడా చాలా మందికి తెలియదు. తెలిస్తే.. ఎంతగానో ఆశ్చర్యపోతారు. అలా మనకు ఉపయోగపడే ఔషధ మొక్కల్లో కోడి జుట్టు ఆకు కూడా ఒకటి. ఇది తోటకూర జాతికి చెందినది. దీన్నే చిలక తోటకూర, పిచ్చి తోటకూర అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ మొక్కలు మన ఇంటి పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి. కానీ చాలా మందికి ఈ మొక్క ఔషధంగా ఉపయోగపడుతుందని తెలియదు. ఈ మొక్క విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. కొందరు దీన్ని తోటకూర అని కూడా భ్రమిస్తారు. కానీ తోటకూర ఆకులు కాస్త బరకగా ఉంటాయి. కోడిజుట్టు ఆకులు కాస్త మృదువుగా ఉంటాయి. ఇక ఈ మొక్క మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
కోడి జుట్టు ఆకును చాలా మంది చాలా ప్రాంతాల్లో భిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనకు ఈ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. వీటిని చూస్తే పిచ్చి మొక్క అని కూడా అనుకుంటారు. కానీ వీటితో కలిగే లాభాలు తెలిస్తే.. అసలు ఈ మొక్కను విడిచిపెట్టరు. ఇక ఈ మొక్క ఆకులను మనం పలు విధాలుగా ఉపయోగించి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మొక్క ఆకుల్లో ఫైబర్, కార్బొహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, రైబోఫ్లేవిన్, థయామిన్, విటమిన్ సి వంటి పోషకాలు అన్నీ ఉంటాయి. అలాగే ఈ మొక్క ఆకులను తినడం వల్ల శరీరంలోని వేడి మొత్తం దిగిపోతుంది. ఒంటికి చలువ చేస్తుంది.
అధిక వేడితో బాధపడేవారు ఈ ఆకులను తినడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. దీంతో మూత్రంలో మంట కూడా తగ్గుతుంది. మూత్రం ధారాళంగా వస్తుంది. ఈ ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసి మొలలపై రాత్రి పూట రాయాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే ఎలాంటి పైల్స్ అయినా సరే తగ్గుతాయి. ఈ మొక్క మొత్తాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా కాచాలి. అనంతరం దీన్ని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. దీంతో డయేరియా, వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే మలినాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.
కోడి జుట్టు ఆకు వేళ్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచాలి. అనంతరం రసం తీయాలి. దాన్ని రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేయాలి. దీంతో మూత్రం మంట తగ్గుతుంది. అలాగే ఈ మొక్క విత్తనాలను సేకరించి ఎండబెట్టాలి. అనంతరం ఈ విత్తనాలు, అంజీర పండ్లు, పటిక బెల్లంలను సమాన భాగాల్లో తీసుకోవాలి. వాటన్నింటినీ దంచి పొడి చేయాలి. ఆ పొడిని సీసాలో భద్ర పరచాలి. దీన్ని రోజుకు 15 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకుని రోజుకు ఒకసారి తాగాలి. ఇలా 2 వారాల పాటు చేస్తే కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి.
కోడి జుట్టు ఆకుల పేస్ట్‌ను తీసుకుని విరిగిన ఎముకలకు కట్టులా కడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. దీన్ని ఆకు కూరగా కూడా వండుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తింటే ఎలాంటి జీర్ణ సమస్యలు అయినా సరే నయం అవుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంపై వచ్చే కురుపులు కూడా తగ్గుతాయి. అందుకు గాను ఈ ఆకుల పేస్ట్‌ను సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తుండాలి. ఇలా కోడిజుట్టు ఆకుతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఇకపై ఈ మొక్క కనిపిస్తే.. విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో దీన్ని పెంచుకోవచ్చు. ఎన్నో లాభాలను అందిస్తుంది.