Rasgulla : రసగుల్లా.. ఇది మనందరికి తెలిసిందే. రసగుల్లా అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఈ రసగుల్లను సాధారణంగా పాలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ రసగుల్లా గురించే మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది. కేవలం పాలతో కాకుండా మినపప్పుతో కూడా మనం రసగుల్లాను తయారు చేసుకోవచ్చు. ఈ రసగుల్లాలు చిన్నగా ఉండడంతో పాటు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మన చిన్నతనంలో ఎక్కువగా దొరికేవి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ చిన్న రసగుల్లాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రసగుల్లా తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక టీ గ్లాస్, బియ్యం – రెండు టీ గ్లాసులు, ఉప్పు – చిటికెడు, వంటసోడా – పావు టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పంచదార – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు.
రసగుల్లా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి వీలైనంత గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, ఫుడ్ కలర్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గుండ్రంగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో పంచదార, నీళ్లు వేసి వేడి చేయాలి. పంచదార కరిగి జామున్ పాకం వచ్చే వరకు ఉడికించాలి.
పంచదార మిశ్రమం కొద్దిగా జిగురుగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి అందులో ముందుగా వేయించుకున్న జామున్ ను వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు ఈ మిశ్రమంలో ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని ఇలాగే నేరుగా తినవచ్చు లేదా పంచదారలో ముంచి తీసి తినవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా, జ్యూసీగా ఉండే రసగుల్లా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇలా రసగుల్లాను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని ఇంట్లో అందరూ విడిచిపెట్టకుండా ఎంతో ఇష్టంగా తింటారు.