Tomato Chikkudukaya Kura : మనం చిక్కుడు కాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి మనకు ఏడాదంతా విరివిరిగా లభిస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. చిక్కడుకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చిక్కడుకాయలతో చేసే ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా ఎవరైనా సులభంగా, రుచిగా చేసుకోగలిగే టమాట చిక్కడుకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట చిక్కుడు కాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 400 గ్రా., చిక్కుడు కాయలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
టమాట చిక్కుడు కాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత చిక్కుడ కాయ ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిక్కడు కాయ ముక్కలను మగ్గించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. దీనిపై మరలా మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చిక్కడు కాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాట చిక్కడు కాయ కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.