Tamarind Fruit : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే చింతకాయలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చింతకాయల నుంచి వచ్చే చింతపండును ఎక్కువగా వంటల్లో వేస్తుంటారు. దీంతో తీపి, కారం రెండు రకాల వంటలను చేస్తారు. సూప్‌లు, కూరలు, పులుసు, చారు వంటి వాటిల్లో చింతపండును వేస్తుంటారు. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే చింతపండే కాదు.. చింతకాయలను కూడా చాలా మంది వాడుతుంటారు. ఇవి వంటలకు చక్కని రుచిని అందించడమే కాదు.. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. చింతకాయల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయల లోపల ఉండే గుజ్జులో టార్టారిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీని వల్లే చింతకాయలు లేదా పండు పులుపుగా, వగరుగా ఉంటుంది. దీని మోతాదు తగ్గితే చింతకాయలు తియ్యగా ఉంటాయి. ఇలాంటి కాయలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక చింతకాయల వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అనబడే పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే చింతకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు.. ఇతర గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు.
చింతకాయలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అందుకనే చింతపండుతో చేసే చారు లేదా రసం వంటి వాటిని భోజనంలో తినాలని మన పెద్దలు సూచిస్తుంటారు. ఇక చింతపండులో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రక్తహీనత నుంచి బయట పడేస్తుంది. రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. ఇలా చింతకాయలు లేదా పండుతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక చింత పండును దూరం పెట్టకండి. దీంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి.