Flax Seeds Powder For Thyroid : ప్రస్తుతకాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ఎక్కువగా స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి మన గొంతు దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ విడుదలలో వచ్చే అసమతుల్యతల కారణంగా శరీరంలో జీవక్రియల రేటు తగ్గుతుంది. దీనినే థైరాయిడ్ అని అంటారు. థైరాయిడ్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఈ గ్రంథి హార్మోన్లను తక్కువగా విడుదల చేస్తే దానిని హైపో థైరాయిడిజం అంటారు. చాలా మంది ఈ హైపో థైరాయిడిజంతోనే బాధపడుతున్నారు. అలాగే థైరాయిడ్ గ్రంథి మోతాదుకు మించి హార్మోన్లు విడుదల చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు.
థైరాయిడ్ కారణంగా త్వరగా అలసిపోవడం, శరీరంలో శక్తి తగ్గడం, చలి ఎక్కువగా అనిపించడం, బరువు పెరగడం, జుట్టు రాలడం, ఎక్కువగా చెమట పట్టడం వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మందులతోనే ఈ సమస్య నియంత్రణలోకి వస్తుంది అనుకుంటే తప్పు. మందులను వాడుతూనే చక్కటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల కూడా మనం థైరాయిడ్ సమస్యను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ ను అదుపులో ఉంచే చిట్కాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో రెండు టీ స్పూన్ల ధనియాలను వేసి మరిగించాలి.
ఈ నీటిని 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా ధనియాల కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో అవిసె గింజలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. తగినన్ని అవిసె గింజలను తీసుకుని కళాయిలో వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఈ గింజలను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఉదయం పరగడుపున ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.
అలాగే ఈ అవిసె గింజల పొడిని పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు. అదే విధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే హైపర్ థైరాయిడిజం తో బాధపడే వారు ఆహారంగా పచ్చి కూరగాయలను తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా క్యాబేజి, క్యాలీప్లవర్, బ్రొకోలి, ముల్లంగి వంటి వాటిని తక్కవగా తీసుకోవాలి. అలాగే పాలు, పాల ఉత్పత్తులను కూడా తక్కువగా తీసుకోవాలి. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఆహారంలో బి విటమిన్, ఐరన్, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే చేపలు, కోడిగుడ్లను , క్యారెట్, గుమ్మడి వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి. చక్కటి జీవన శైలిని అనుసరించాలి. మందులతో పాటుగా ఈ చిట్కాలను పాటించడం వల్ల థైరాయిడ్ సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు.