Kobbari Kova : స్వీట్ షాపుల్లో మనకు కోవా లభిస్తుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటుంటారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఈ కోవాను మనం ఇంకాస్త వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కొబ్బరితురుము పెట్టి చేసే కజ్జికాయలను తినే ఉంటారు. వాటిల్లోని కొబ్బరి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కజ్జికాయల మాదిరిగానే వాటిలో పెట్టేలాంటి కొబ్బరి తురుముతో కోవాను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా సులభమే. కొబ్బరి తురుముతో కోవాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి కోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి తురుము – 2 కప్పులు, చిక్కని పాలు – 1 లీటర్, చక్కెర – అర కిలో, యాలకులు – 6, జీడిపప్పు – చిన్న కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు.
కొబ్బరి కోవాను తయారు చేసే విధానం..
ముందుగా ఒక మందపాటి పాత్రలో పాలు పోసి స్టవ్ మీద చిన్నమంటపై పాలను బాగా మరిగించాలి. పాలు మొత్తం కోవా ముద్దలా తయారయ్యే వరకు వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలోనే ఒక వెడల్పాటి పాత్రలో కొబ్బరి తురుము, చక్కెర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగి ముద్దగా అవుతున్న సమయంలో ఆ పాలలో కొబ్బరి తురుము, చక్కెర కలిపిన మిశ్రమాన్ని వేసి బాగా కలియబెట్టాలి. పాలలో నీరు మొత్తం ఇంకిపోయాక జీడిపప్పు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టి దింపాలి.
తరువాత ఒక పెద్ద ప్లేట్ పై నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసి ప్లేటు మొత్తం సమానంగా పరచాలి. పది నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని గాలికి ఆరనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన కొబ్బరి కోవా తయారైనట్లే. ఈ కొబ్బరి కోవాను మనం మూడు నాలుగు రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు.