Bachali Kura : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలిసిందే. మనం వివిధ రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ ఆకుకూరలను శుభ్రం చేయడానికి ఎక్కువగా సమయం పడుతుందని, పసరు వాసన వస్తుందని చాలా మంది వీటిని తీసుకోవడం తగ్గిస్తున్నారు. ఆకుకూరలనే తక్కువగా తీసుకుంటున్నారు అనుకుంటే వివిధ రకాల ఆకుకూరలను మరింత తక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో బచ్చలికూర ఒకటి. ఇతర ఆకుకూరలతో పోలిస్తే బచ్చలికూరే చాలా చవక. అలాగే సంవత్సరం మొత్తం లభ్యమవుతుంది. ఎటువంటి సస్య సంరక్షణ చర్యలు చేపట్టకపోయినా బచ్చలికూర చాలా సులభంగా పెరుగుతుంది. బచ్చలికూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. గుండెకు, మెదడుకు లాభాలను కలిగించే పోషకాలు బచ్చలికూరలో అనేకం ఉన్నాయి.
బచ్చలికూర గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని 2020 వ సంవత్సరంలో మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇస్కాన్ సిన్ ( యూ ఎస్ ఎ ) వారు పరిశోధనల ద్వారా వెల్లడించారు. 100 గ్రా. ల బచ్చలికూరలో 108 మైక్రో గ్రాముల ఫోలైట్ ఉంటుందని ఈ ఫోలైట్ తో ల్యూటిన్, కెరోటిన్, జియోజ్గాంతిన్ అనే మూడు పోషకాలు కూడా కలిసి ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ నాలుగు పోషకాలు కూడా మన శరీరంలో గుండె మరియు మెదడు అనారోగ్యానికి కారణమయ్యే హోమోసిస్టిన్ ఉత్పత్తిని నిర్మూలించి గుండెను, మెదడును రక్షిస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. బచ్చలి కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె మరియు మెదడుకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా చేయడంలో బచ్చలికూర ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.
కూరగాయలను వండడానికి నూనెలు, మసాలాలు, ఉప్పు ఎక్కువగా అవసరమవుతుంది. అలాగే ఎక్కువ సమయం కూడా పడుతుంది. కానీ ఆకుకూరలు వండడానికి తక్కువ సమయంతో పాటు తక్కువ మసాలాలు అవసరమవుతాయి. బచ్చలికూరతో పప్పును, వేపుడును చేసుకోవడంతో పాటు ఇతర ఆకుకూరలతో, కూరగాయలతో కలిపి కూడా వండుకుని తినవచ్చు. తీగ బచ్చలిని, పాదు బచ్చలిని దేనిని తీసుకున్నా కూడా మనం ఒకే రకమైన ప్రయోజనాలను పొందవచ్చని వీటి కాడలను కూడా మనం వంటల్లో వేసుకోవచ్చు. దీనిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకునే ప్రయత్నం చేయాలని బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.