Andu Korralu : మన ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం అనేక రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో అండు కొర్రలు ఒకటి. ఇతర చిరు ధాన్యాల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అండు కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే అధిక బరువుతో బాధపడే వారు ఈ అండు కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి 3 శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అండు కొర్రలు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఈ విధంగా అండు కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర చిరు ధాన్యాల వలె వీటితో కూడా మనం రొట్టెలను తయారు చేసుకోవచ్చు. అండు కొర్రలతో రొట్టెలను తయారు చేయడం చాలా తేలిక. ముందుగా అండు కొర్రలను శుభ్రంగా కడిగి నీటిలో పోసి నానబెట్టాలి. వీటిని 8 గంటల పాటు నానబెట్టిన తరువాత వడకట్టి ఎండలో పోసి ఆరబెట్టాలి. ఇవి బాగా ఎండిన తరువాత కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని పిండిగా చేసుకోవాలి. ఒక కిలో అండు కొర్రల పిండికి 100 గ్రాముల మినపప్పును పిండిగా చేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని తగిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ నెమ్మదిగా రొట్టె ఆకారంలో చపాతీ కర్రతో వత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రొట్టెను బాగా కాలిన పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఈ రొట్టెను కాలడానికి కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుంది. ఈ రొట్టెను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అండు కొర్రల రొట్టె తయారవుతుంది. పిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే ఈ రొట్టెలు అంత మెత్తగా ఉంటాయి. ఈ పిండిలో పెరుగు వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న రొట్టెలను ఏ కూరతోనైనా తినవచ్చు. ఈ విధంగా అండు కొర్రలతో రొట్టెలను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా, మెత్తగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.