Coconut Junnu : మనం కొబ్బరి పాలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి వలె కొబ్బరి పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి పాలు రుచిగా ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కొబ్బరి పాలతో తయారు చేసుకోదగిన తీపి వంటకాల్లో కొకొనట్ పుడ్డింగ్ కూడా ఒకటి. ఈ పుడ్డింగ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి ఉండాలే కానీ దీనిని పిల్లలు కూడా చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే కొకొనట్ పుడ్డింగ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొకొనట్ పుడ్డింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి కాయ – 1, నీళ్లు – 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్స్, పంచదార – అర కప్పు.
కొకొనట్ పుడ్డింగ్ తయారీ విధానం..
ముందుగా కొబ్బరి కాయ నుండి కొబ్బరిని వేరు చేయాలి. తరువాత కొబ్బరికి వెనుగ వైపు ఉండే భాగాన్ని తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ కొబ్బరి ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ స్టెయినర్ లోకి కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని దానిని స్పూన్ తో గట్టిగా వత్తుతూ కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. తరువాత ఈ కొబ్బరి పాలల్లో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత పంచదార వేసి అది కరిగే వరకు కలపాలి. ఇప్పుడు ఈ పాలను అడుగు మందంగా ఉండే ఒక గిన్నెలో పోసి వేడి చేయాలి. వీటిని 3 నిమిషాల పాటు కలుపుతూ మధ్యస్ధ మంటపై వేడి చేయాలి. పాలు ఉండలు కట్టడం ప్రారంభమవుతుంది.
అలాంటి సమయంలో మంటను చిన్నగా చేసి అడుగు మాడిపోకుండా బాగా కలుపుతూ వేడి చేయాలి. కొబ్బరి పాల మిశ్రమం దగ్గర పడి గంటె జారుడుగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గాజు గిన్నెలోకి లేదా స్టీల్ గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ గిన్నెను గంటన్నర నుండి రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత గిన్నెను బయటకు తీసి పుడ్డింగ్ ను ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొకొనట్ పుడ్డింగ్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొకొనట్ పుడ్డింగ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.