Bengali Rava Burfi : బొంబాయి రవ్వతో ఉప్మానే కాకుండా మనం వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో బెంగాలీ రవ్వ బర్ఫీ కూడా ఒకటి. బెంగాలీ వాళ్లు ఎక్కువగా చేసే తీపి వంటకాల్లో ఇది ఒకటి. మామూలు రవ్వ బర్ఫీ కంటే ఈ రవ్వ బర్ఫీ మరింత రుచిగా ఉంటుంది. ఈ బెంగాలీ రవ్వ బర్పీని తయారు చేయడం చాలా సులభం. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే బెంగాలీ రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగాలీ రవ్వ బర్పీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, బిర్యానీ ఆకులు – 2, జీడిపప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 3 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – 2 కప్పులు, పంచదార – ఒక కప్పు, రెడ్ ఫుడ్ కలర్ – 2 చిటికెలు, ఆరెంజ్ ఫుడ్ కలర్ – రెండు చిటికెలు, బాదం పప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్.
బెంగాలీ రవ్వ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక బొంబాయి రవ్వ, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. రవ్వను చిన్న మంటపై కలుపుతూ రంగు మారే వరకు వేయించాలి. రవ్వ సగానికి పైగా వేగిన తరువాత అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. ఇలా రవ్వను పదిహేను నిమిషాల పాటు వేయించిన తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పంచదార, ఫుడ్ కలర్స్ వేసి కలపాలి. పంచదార కరిగి రవ్వ దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. రవ్వ దగ్గర పడి కళాయికి అంటుకోకుండా వేరవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ బిర్యానీ ఆకులను తొలగించాలి. తరువాత ఈ రవ్వ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రే లోకి తీసుకోవాలి.
తరువాత పైన అంతా సమానంగా చేసుకుని ఒక టేబుల్ నెయ్యి రాయాలి. తరువాత దీనిని రెండు గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లబడి గట్టిపడిన తరువాత ట్రే నుండి వేరు చేసుకోవాలి. తరువాత దీనిపై బాదం పలుకులను చల్లి చేత్తో కొద్దిగా లోపలికి వత్తాలి. తరువాత దీనిని మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెంగాలీ రవ్వ బర్ఫీ తయారవుతుంది. దీనిపై సిల్వర్ పాయిల్ ను కూడా అత్తికించుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు ఇలా బెంగాలీ రవ్వ బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.