Masala Vada Curry : మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా మసాలా వడలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మసాలా వడలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వడలను ఎంతో ఇష్టంగా తింటారు. నేరుగా తినడంతో పాటు ఈ మసాలా వడలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా వడలతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే మసాలా వడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వడ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన శనగపప్పు – 100 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, సోంపు గింజలు – అర టీ స్పూన్, గరం మసాలా – అర టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా వడ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో శనగపప్పును, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిక్సీ పట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సోంపు గింజలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత వడ ముక్కలను, రెండు గ్లాసుల నీళ్లను పోసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మసాలా వడలతో ఈ విధంగా తయారు చేసిన కూరను అందరూ చాలా ఇష్టంగా తింటారు.