Boondi Curry : కారం బూందీ.. ఈ వంటకం గురించి మనందరికి తెలిసిందే. పండుగలకు, అలాగే స్నాక్స్ గా తినడానికి తయారు చేస్తూ ఉంటాం. కార బూందీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ బూందీని స్నాక్స్ గా తినడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం పది నిమిషాల్లోనే ఈ బూందీ కూరను మనం తయారు చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడేలా ఈ బూందీ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బూందీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కారం బూందీ – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు, కారం – పావు టీ స్పూన్.
బూందీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బూందీ వేసి కలపాలి. బూందీ మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం లేనప్పుడు, ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఇలా బూందీతో కూరను చేసుకుని తినవచ్చు. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.