Potato Garlic Bites : బంగాళాదుంపలను మనం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. కేవలం కూరలు, వేపుళ్లే కాకుండా బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పొటాటో గార్లిక్ బైట్స్ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఈ బైట్స్ ను తయారు చేయడం కూడా చాలా సులువు. రుచిగా, కరకరలాడుతూ ఉండే పొటాటో గార్లిక్ బైట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో గార్లిక్ బైట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, బియ్యంపిండి – ఒక కప్పు, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కొత్తిమీర – కొద్దిగా.
పొటాటో గార్లిక్ బైట్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను గడ్డలు లేకుండా తురుముకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత రెడ్ చిల్లీ ప్లేక్స్, కొత్తిమీర వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం పిండి వేసి కలపాలి. బియ్యం పిండిని చక్కగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. బియ్యం పిండి చల్లారిన తరువాత బంగాళాదుంప తురుము వేసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న బాల్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో బైట్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ బైట్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.