Watermelon For Beauty : మనం పుచ్చకాయను కూడా ఆహారంగా తీసుకుంటాము. పుచ్చకాయలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వేసవికాలంలో పుచ్చకాయను తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. కేవలం మన ఆరోగ్యానికే కాదు మన అందానికి కూడా పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై ఉండే నలుపును తొలగించి ముఖాన్ని అందంగా, మృదువుగా మార్చడంలో పుచ్చకాయ మనకు ఎంతో సహాయపడుతుంది. అయితే పుచ్చకాయను ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనం మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల పుచ్చకాయ జ్యూస్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ శనగపిండి వేసి కలపాలి. తరువాత ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. పొడి చర్మం, సున్నిత చర్మం ఉన్న వారు ఇందులో నిమ్మరసానికి బదులుగా పెరుగును వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించే ముందు రోజ్ వాటర్ లో దూదిని ముంచి ముఖాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. తరువాత 3 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత దీనిపై ఇదే మిశ్రమాన్ని మరలా రాసుకోవాలి.
ఇలా రెండోసారి రాసుకున్న మిశ్రమం కూడా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఉండే నలుపు, మృతకణాలు అన్ని తొలగిపోతాయి. ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడు సార్లు వాడడం వల్ల మనం మన సౌందర్యాన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు.