Vankaya Pachadi : మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలతో కూరలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. అయితే తరచూ వంకాయ పచ్చడి కంటే కింద చెప్పిన విధంగా చేసే వంకాయ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా వంకాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావుకిలో, పచ్చిమిర్చి – 10, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన ఉల్లిపాయ -1, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, ఎండుమిర్చి – 2.
వంకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు మెత్తగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వాలి. తరువాత జార్ లో వేయించిన దినుసులు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వంకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత తాళింపు కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకునని తినవచ్చు.