Kunda Majjiga : వేసవికాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కనుక శరీరాన్ని ఎల్లప్పుడు డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లతో పాటు మజ్జిగను తాగడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్ ను తిరిగి పొందవచ్చు. అందులోను కుండ మజ్జిగను తాగడం వల్ల మన శరీరానికి మరింత మేలు కలుగుతుంది. కుండ మజ్జిగను తాగడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా, చల్ల చల్లగా కుండ మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కుండ మజ్జిగ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – 2 కప్పులు, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా, పచ్చిమిర్చి – 1, నిమ్మకాయ – అర చెక్క, అల్లం – అర అంగుళం ముక్క, జీలకర్ర – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – రెండు గ్లాసులు.
కుండ మజ్జిగ తయారీ విధానం..
ముందుగా రోట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా దంచాలి. తరువాత లోతుగా ఉండే గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కవ్వంతో చిలకాలి. ఇప్పుడు ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ మజ్జిగను కుండలో పోసి దానిపై మూత పెట్టాలి. ఇప్పుడు ఈ కుండ చుట్టూ నీటిలో తడిపిన కాటన్ వస్త్రాన్ని చుట్టాలి. ఇలా చేయడం వల్ల కుండ మజ్జిగ తయారవుతుంది. ఈ మజ్జిగ చల్లారిన తరువాత తాగడం వల్ల రుచిగా ఉండడంతో పాటు శరీరానికి కూడా చలువ చేస్తుంది. వేసవికాలంలో ఇలా మజ్జిగను తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.