Wheat Flour Noodles : నూడుల్స్.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు ఇన్ స్టాంట్ నూడుల్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో వివిధ రుచుల్లో ఈ నూడుల్స్ లభిస్తాయి. అయితే ఈ నూడుల్స్ రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందనే చెప్పవచ్చు. ఈ నూడుల్స్ ను తయారు చేయడానికి మైదాపిండిని, కార్న్ ఫ్లోర్ ను ఉపయోగిస్తారు. అలాగే రకరకాల సాస్ లను, టేస్టింగ్ సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి హాని కలగకుండా కూడా మనం నూడుల్స్ ను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. రుచిగా, కమ్మగా ఆరోగ్యానికి మేలు చేసేలా గోధుమపిండితో నూడుల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, నీళ్లు – 3 గ్లాసులు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన క్యాప్సికం – 1,తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – ముప్పావు కప్పు, మిరియాల పొడి – అర టీ స్పూన్, మ్యాగీ మసాలా పొడి ప్యాకెట్ – చిన్నది ఒకటి, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.
గోధుమపిండి నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని మురుకుల గొట్టంలో ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 3కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత పిండిని తీసుకుని నూడుల్స్ లాగా వత్తుకోవాలి. తరువాత వీటిని నెమ్మదిగా కదుపుతూ 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ నూడుల్స్ ను చల్లటి నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం వేసి కలపాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని మరో నాలుగు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, అర టీ స్పూన్ కారం, మిరియాల పొడి, మ్యాగీ మసాలా పొడి వేసి కలపాలి. తరువాత నూడుల్స్ వేసి కలపాలి. వీటిని పెద్ద మంటపై టాస్ చేసుకున్న తరువాత కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి నూడుల్స్ తయారవుతాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తినవచ్చు. ఈ నూడుల్స్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.