Salt In Curries : మనం వంటింట్లో రకరకకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కూరలు, పులుసు కూరలు, సాంబార్, రసం, పప్పు కూరలు, గ్రేవీ కూరలు ఇలా అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కూరలను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే చెప్పవచ్చు. మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ కూడా ఎక్కువగా కూరల ద్వారాను లభిస్తూ ఉంటాయి. కూరలు రుచిగా ఉంటేనే మనం సంతృప్తిగా భోజనం చేయగలం. అయితే కొన్ని సార్లు కూరలు వండేటప్పుడు వాటిల్లో ఉప్పు, కారం ఎక్కువవుతూ ఉంటుంది. కారం ఎక్కువైన ఎలాగోలా తినవచ్చు కానీ ఉప్పు ఎక్కువ అయితే మాత్రం కూరలను అస్సలు తినలేము.
అలాగని కూరలను పారేయనూ లేము. అలాంటి సందర్భాల్లో కొన్ని చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గించవచ్చు. కూరల్లో ఎక్కువైన ఉప్పును ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం. బంగాళాదుంపను వాడడం వల్ల మనం చాలా సులభంగా కూరల్లో ఉప్పును తగ్గించవచ్చు. బంగాళాదుంపపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఉడుకుతున్న కూరల్లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల కూరల్లో ఉప్పు, కారం తగ్గి కూరలు చప్పబడతాయి. అలాగే అర కప్పు మైదా పిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉండలను ఉడుకుతున్న కూరలో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మైదా పిండి ఉండలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల కూరల్లో ఎక్కువైన ఉప్పు 80 శాతం వరకు తగ్గుతుంది. అలాగే కూరల్లో పంచదారను వేయడం వల్ల కూడా ఉప్పు, కారం తగ్గుతుంది. అదే విధంగా ఒక టమాటకాయను ముక్కలుగా కట్ చేసి ఉడుకుతున్న కూరలో వేయడం వల్ల కూరల్లో ఎక్కువైన ఉప్పు తగ్గుతుంది. అదే విధంగా గట్టిగా ఉండే కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి పలుచగా చేయడం వల్ల కూడా ఉప్పు తగ్గుతుంది. ఈ చిట్కాలను వాడడం వల్ల కూరల్లో ఎక్కువగా ఉన్న ఉప్పు తగ్గుతుంది.