Beetroot Pachadi : బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవాలని మనకువైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. వీటితో ఎక్కువగా జ్యూస్ ను చేసుకుని తాగుతూ ఉంటాము. కొందరు బీట్ రూట్ ముక్కలనే నేరుగా తినేస్తూ ఉంటారు. ఇలా బీట్ రూట్ ను పచ్చడి తీసుకోవడం ఇష్టంలేని వారు వీటితో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ బీట్ రూట్ పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడాచాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ బీట్ రూట్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బీట్ రూట్ – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 4, బెల్లం – చిన్న ముక్క, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – కొద్దిగా, చింతపండు – ఒక రెమ్మ.
బీట్ రూట్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత బీట్ రూట్ ముక్కలను వేసి వేయించాలి. బీట్ రూట్ ముక్కలను మెత్తబడే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. బీట్ రూట్ ముక్కలు చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వేయించిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, బెల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఇంగువ వేసి కలపాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీట్ రూట్ ను నేరుగా తినలేని వారు ఇలా రుచిగా పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.