Sweet Shop Style Palli Undalu : మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే చిరుతిళ్లల్లో పల్లి ఉండలు కూడా ఒకటి. ఇవి తెలియని వారు.. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పల్లి ఉండలు చాలా రుచిగా ఉంటాయి. పల్లి ఉండలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. శరీరం బలంగా తయారవుతుంది. ఎముకలు ధృడంగా మారతాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రోజుకు ఒకటి చొప్పున వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పల్లి ఉండలను తయారు చేయడం కూడా చాలా సులభం. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాపు స్టైల్ లో ఈ పల్లి ఉండలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి ఉండల తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు -ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు.
పల్లి ఉండల తయారీ విధానం..
ముందుగా పల్లీలను ఒక కళాయిలో తీసుకుని మధ్యస్థ మంటపై వేయించాలి. వీటిని పూర్తిగా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత వడకట్టి మరలా కళాయిలోకి తీసుకోవాలి. ఈ బెల్లాన్ని ముదురు పాకం వచ్చే వరకు వేడి చేయాలి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో బెల్లం పాకాన్ని వేసి చూడాలి. బెల్లం పాకం ఉండగా గట్టిగా అయితే పాకం వచ్చినట్టుగా భావించాలి. ఇలా బెల్లం ముదురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించిన పల్లీలు వేసి కలపాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత చేతికి చల్లటి నీటితో తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా పల్లి మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి ఉండలు తయారవుతాయి. ఇలా ఉండలుగా చేసుకోలేని వారు పల్లి పట్టీలుగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పల్లి ఉండలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.