Paneer Payasam : మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పాయసం కూడా ఒకటి. పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా సేమ్యా, బియ్యం వంటి వాటితోనే పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాము. కానీ తరచూ ఒకేరకం కాకుండా భిన్నంగా మనం పనీర్ తో కూడా రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. పనీర్ తో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కనుక దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పనీర్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర లీటర్, నిమ్మరసం – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, అరగంట పాటు నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యం – పావు కప్పు, చిక్కటి పాలు – అర లీటర్, యాలకుల పొడి – అర టీ స్పూన్, బెల్లం తురుము – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, ఎండుకొబ్బరి ముక్కలు – కొద్దిగా.
పనీర్ పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి 2 పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసాన్ని నీటిలో కలిపి పాలల్లో వేసి కలపాలి. కొద్ది సమయానికి పాలు విరిగిపోతాయి. ఈ పాలవిరుగుడును వడకట్టి నీటితో కడగాలి. తరువాత నీరంతా పోయేలా గట్టిగా పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పనీర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. సగ్గుబియ్యం సగానికి పైగా ఉడికిన తరువాత పాలు పోసి ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తరువాత యాలకుల పొడి, బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత పనీర్ వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. తరువాత ఈ డ్రై ఫ్రూట్స్ ను నెయ్యితో సహా వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా పనీర్ తో రుచిగా పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పనీర్ పాయసాన్ని తినడం వల్ల మనం రుచితో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా పొందవచ్చు.