Muscle Cramps : మారిన మన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది శరీరాన్ని ఎక్కువగా కదిలించకుండానే కూర్చుని పనులు చేసుకుంటున్నారు. ఇలా శరీరాన్ని కదిలించకుండా పని చేయడం వల్ల వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. వాటిలో కండరాలు పట్టేయడం కూడా ఒకటి. శరీరాన్ని రోజూ కదిలించకుండా ఉంచి ఒకేసారి కదిలించడం వల్ల ఇలా కండరాలు పట్టేస్తూ ఉంటాయి. వ్యాయామాలు చేసినప్పుడు, ఎక్కువగా నవ్వినప్పుడు, బిగుతుగా ఉండే దుస్తులను ధరించడానికి కుస్తీలు పడుతున్నప్పుడు, ఎత్తులో ఉండే వస్తువులను అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు కండరాలు పట్టేస్తూ ఉంటాయి.
అలాగే కొందరికి నిద్రలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి. కండరాలు పట్టేయడం వల్ల విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. కొందరు ఈ నొప్పిని తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంటారు కూడా. చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి మందులు వాడుతూ ఉంటారు. మందులు వాడడం వల్ల ఫలితం ఉంటుంది. కానీ కొందరు మందులు వాడకుండా సహజ సిద్దంగా ఈ సమస్య నుండి బయట పడాలని అనుకుంటారు. ఇలా కండరాలు పట్టేసినప్పుడు సహజ సిద్దంగా లభించే పిప్పర్ మెంట్ ఆయిల్ ను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
పిప్పర్ మెంట్ ఆయిల్ పై కెనడా దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. పిప్పర్ మెంట్ ఆయిల్ లో మెంథాల్, మెంథీన్, మెంథిల్ ఎసిటేట్ వంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కండరాలను విశ్రాంతిని కలిగించి నొప్పులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. మనకు ఆన్ లైన్ లో ఈ ఆయిల్ సులభంగా లభిస్తుంది. అలాగే ఈ ఆయిల్ గాఢత ఎక్కువగా ఉంటుంది. కనుక ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో తీసుకుని రాసుకోవాలి. దీని గాఢత, మంటను తట్టుకోలేని వారు కొబ్బరి నూనెలో రెండు లేదా మూడు చుక్కల పిప్పర్ మెంట్ ఆయిల్ ను వేసి రాసుకోవచ్చు.
కండరాలు పట్టేసిన చోట అలాగే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు ఉన్న చోట కూడా ఈ నూనెను రాసుకోవచ్చు. కండరాలు పట్టేసిన చోట ఈ నూనెను రాసి 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. ఇలా 4 నుండి 5 రోజుల పాటు చేయడం వల్ల కండరాలు పట్టేయడం తగ్గుతుంది. అలాగే కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. తరచూ కండరాలు పట్టేసే వారు ఈ ఆయిల్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.