Bhakarwadi Sweet : మనకు స్వీట్ షాపుల్లో, బేకరీలలో లభించే చిరుతిళ్లల్లో భాకర్ వాడి కూడా ఒకటి. ఇవి పుల్ల పుల్లగా, తియ్యగా,కారంగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ భాకర్ వాడి స్నాక్స్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే భాకర్ వడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భాకర్ వాడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, వేడి నూనె – 3 టీ స్పూన్స్.
చింతపండు చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతపండు గుజ్జు – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా, కారం – పావు టీ స్పూన్, బెల్లం తురుము – ఒక టీ స్పూన్.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, గసగసాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్స్.
భాకర్ వడి తయారీ విధానం..
ముందుగా చింతపండు గుజ్జులో ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి దగ్గర పడే వరకు ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో మైదాపిండి, శనగపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, నువ్వులు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత గసగసాలు, ఎండుకొబ్బరి పొడి వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ దినుసులన్నింటిని జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ముందుగా కలిపిన పిండిని తీసుకుని చపాతీలా చేసుకోవాలి.
తరువాత ఈ చపాతీని చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. తరువాత దీనిపై ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జును రాసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని చల్లుకోవాలి. తరువాత ఈ చపాతీని రోల్ లాగా చుట్టుకోవాలి. అంచులు ఊడిపోకుండా నీటితో తడి చేసి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తరువాత కత్తితో అంగుళం వెడల్పుతో కట్ చేసుకోవాలి. తరువా అంచులు ఊడిపోకుండా కొద్దిగా వత్తాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వత్తుకున్న భకర్ వాడిలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వ్లల ఎంతో రుచిగా ఉండే కరకరలాడుతూ ఉండే భకర్ వాడిలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.