Shivangi Pulusu : శివంగి పులుసు.. వంకాయలతో చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా చేసేవారు. ఉత్తరాంధ్రవారి సాంప్రదాయపు వంటకమైన ఈ శివంగి పులుసు కూర తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా ఈ కూరను సులభంగా చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఈ పులుసు చాలా చక్కగా ఉంటుంది. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే శివంగి పులుసు తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
శివంగి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – ఒక ఇంచు ముక్క, తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, వంకాయలు – 300 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, కారం – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, బెల్లం – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీస్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి- 5 లేదా 6, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్.
శివంగి పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మసాలా పొడికి కావల్సిన మిగిలిన పదార్థాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువాత ఈ పొడి నుండి సగం పొడిని తీసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే జార్ లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలల్లో స్టఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసి మూత పెట్టి వేయించాలి.
వీటిని మధ్య మధ్యలో అటూ ఇటూ తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు, చింతపండు రసం, బెల్లం వేసి కలపాలి. పులుసు మరిగిన తరువాత వేయించిన వంకాయలు, మిగిలిన మసాలా పొడి వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శివంగి పులుసు తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. తరచూ వంకాయలతో ఒకేరకం పులుసు కూరలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.