Chitti Uthappam : మనం అల్పాహారంలో భాగంగా ఊతప్పలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఊతప్పలు చాలా రుచిగా ఉంటాయి. ఏ చట్నీతో తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే తరచూ ఒకేరకం ఊతప్పలు కాకుండా మరింత రుచిగా మనం చిట్టి ఊతప్పలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అప్పటికప్పుడే ఇన్ స్టాంట్ గా తయారు చేసుకుని తినవచ్చు.ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్టి ఊతప్పలను తయారు చేసుకుని తినవచ్చు. పప్పు నానబెట్టే అవసరం లేకుండా ఇన్ స్టాంట్ గా చిట్టి ఊతప్పలను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్టి ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కప్పు, నీళ్లు – అర కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, పుల్లటి పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – చిటికెడు.

చిట్టి ఊతప్పం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఈ అటుకులను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే రవ్వ, పెరుగు, ఉప్పు, వంటసోడా, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి రుద్దాలి. తరువాత పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఊతప్పలుగా వేసుకోవాలి.
తరువాత ఈ ఊతప్పంపై ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు చల్లుకోవాలి. తరువాత ధనియాల కారం చల్లుకోవాలి. తరువాత నూనె వేసుకుని మూత పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి. తరువాత ఈ ఊతప్పలను మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఊతప్పాన్ని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి ఊతప్పాలు తయారవుతాయి. ఇలా అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండే చిట్టి ఊతప్పాలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.