Pallila Kura : మనం వంటల్లో పల్లీలను విరివిగా వాడుతూ ఉంటాము. తాళింపులో అలాగే పచ్చళ్లల్లో, అలాగే పొడిగా చేసి కూడా వాడుతూ ఉంటాము. పల్లీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలను కలిగి ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇలా వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు పల్లీలతో కూడా మనం కూరను తయారు చేసుకోవచ్చు. పల్లీలతో కూర ఏంటి అని ఆలోచిస్తున్నారా… అవును మనం పల్లీలతో కూడా ఎంతో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పల్లీలతో రుచికరమైన కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పల్లీల కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
రెండు గంటల పాటు వేడి నీటిలో నానబెట్టిన పల్లీలు – ఒకకప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాటాలు – 2, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, జీడిపప్పు – 10 నుండి 15, ఎండుమిర్చి – 2, గరం మసాలా – పావు టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, నీళ్లు – 150 ఎమ్ ఎల్.
పల్లీల కూర తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పల్లీలను తీసుకుని అవి మునిగే వరకు నీటిని పోసి వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాటాలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే గరం మసాలా, వాము, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత ఉడికించిన పల్లీలను నీటితో సహా వేసుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లీల కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వెరైటీగా ట్రై చేయాలనుకునే వారు ఇలా పల్లీలతో కూరను తయారు చేసుకుని తినవచ్చు.