Sabudana Paratha : మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులభం. సగ్గుబియ్యంతో తరుచూ చేసే వంటకాలతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ పరాటాలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ పరాటాలను సులభంగా, రుచిగా చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ సగ్గుబియ్యం పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గుబియ్యం – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, పల్లీలు – పావు కప్పు, పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉడికించిన బంగాళాదుంపలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
సగ్గుబియ్యం పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం చక్కగా నానిన తరువాత అందులో బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలుపుకోవాలి. నీటిని పోయకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత ప్లాస్టిక్ పేపర్ ను లేదా బటర్ పేపర్ ను తీసుకుని దానిపై నూనె వేసుకోవాలి. తరువాత సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుని చేత్తో పరాటా లాగా వత్తుకోవాలి.
తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి అందులో నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దానిపై సగ్గుబియ్యం పరాటాను వేసి కాల్చుకోవాలి. ఈ పరాటాలను మధ్యస్థ మంటపై రెండు వైపులా 3 నుండి 4 నిమిషాల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ పరాటాలను పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా సగ్గుబియ్యంతో రుచికరమైన పరాటాలను చాలా సులభంగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.