Macaroni Payasam : మాక్రోని పాస్తా.. ఇది మనందరికి తెలిసిందే. దీనితో ఎక్కువగా మసాలా పాస్తాను తయారు చేస్తూ ఉంటాము. మాక్రోనితో చేసే ఈ మసాలా పాస్తా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం మసాలా పాస్తానే కాకుండా ఈ మాక్రోని పాస్తాతో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. మాక్రోని పాస్తాతో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులను కోరుకునే వారు దీనిని తప్పకుండా ట్రై చేయాలని చెప్పవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఈ పాయసాన్ని అప్పటికప్పుడు తయారు చేసుకుని తినవచ్చు. మాక్రోని పాస్తాతో రుచికరమైన పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాక్రోని పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
మాక్రోని పాస్తా – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – 2టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, పాలు – అరలీటర్, పంచదార – 6 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
మాక్రోని పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక ఒక గిన్నెలో అర కప్పు మాక్రోనిని తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మిగిలిన అర కప్పు మాక్రోనిని అలాగే ఉంచాలి.తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో దంచిన మాక్రోనితో పాటు మిగిలిన మాక్రోనిని కూడా వేసి ఎర్రగా అయ్యే వరకువేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక వేయించిన మాక్రోని వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మాక్రోని మెత్తగా అయ్యే వరకు 8 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలపాలి.
దీనిని చిన్న మంటపై ఉడికిస్తూనే మరో కళాయిలో మిగిలిన పంచదార వేసి క్యారెమెల్ లాగా చేసుకోవాలి. పంచదార కరిగి ఎర్రగా అయిన తరువాత దీనిని ఉడుకుతున్న పాయసంలో వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మాక్రోని పాయసం తయారవుతుంది. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మాక్రోనితో తయారు చేసిన ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు.