Village Style Egg Curry : ఉడికించిన కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఎక్కువగా టమాటాలు వేసి కూరను తయారు చేస్తూ ఉంటాము. ఈ కూరను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే టమాట ఎగ్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మసాలాను దంచి తయారు చేసే ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా గ్రామాల్లో తయారు చేస్తూ ఉంటారు. ఈ విలేజ్ స్టైల్ ఎగ్ కర్రీని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, తరిగిన టమాటాలు – 4, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 6, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక ఇంచు ముక్క, అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6.
ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని రోట్లో వేసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు,మెంతులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత కారం వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అంతా కలిసేలా చక్కగా కలుపుకున్న తరువాత అరగ్లాస్ నీళ్లు పోసి కలపాలి.
ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత దంచిన మసాలా వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా అప్పుడప్పుడూ ఇలా కూడా వండుకుని తినవచ్చు.