Peanut Milk : పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మనం రోజూ పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మనం ఎక్కువగా ఆవు పాలను, గేదె పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే నేటి తరుణంలో చాలా వేగన్ ఆహారాలను తీసుకుంటున్నారు. వేగన్ ఆహారంలో భాగంగా ఆవు పాలు, గేదె పాలకు బదులుగా చాలా మంది పల్లీల నుండి తీసిన పాలను ఆహారంగా తీసుకుంటున్నారు. పల్లీ పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా ప్రోటీన్, విటమిన్ ఇ, విటమిన్ బి12, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పల్లీల నుండి తీసిన పాలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలతో కూడా మనం పెరుగును తయారు చేసుకోవచ్చు.
అలాగే ఆవు, గేదె పాలను వాడినట్టు వంటల్లో, తీపి వంటకాల తయారీలో, మిల్క్ షేక్ ల తయారీలో పల్లీల పాలను కూడా వాడవచ్చు. అయితే ఆవు పాలు, గేదె పాలు లభించినట్టు పల్లీల పాలు మనకు సులభంగా లభించవు. అలాగే ఈ పాలు అధిక ధరతో కూడుకున్నవి. ఇలా బయట అధిక ధరలకు కొనే బదులుగా ఈ పాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పల్లీల నుండి పాలను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ పాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పల్లీల పాలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా పల్లీలను తీసుకుని శుభ్రంగా కడగాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పల్లీలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వస్త్రంలో వేసి గట్టిగా మూట కట్టి పాలను పిండాలి. ఇలా చేయడం వల్ల పల్లీల పాలు తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన పల్లి పాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత మెగ్నీషియం లభిస్తుంది. ఈ పాలల్లో దాదాపు 65 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల నీరసం, బలహీనత దరి చేరకుండా ఉంటాయి. శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. లోబీపీ సమస్యతో బాధపడే వారు ఈ పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పల్లి పాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్ నశిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ పాలల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు పల్లి పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా పల్లి పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఈ విధంగా సులభంగా ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.