Thene Mithayilu : తేనె మిఠాయిలు.. పాతకాలంలో ఎక్కువగా లభించే తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు చిన్న చిన్న దుకాణాల్లో ఇవి ఎక్కువగా లభించేవి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. తేనె మిఠాయిలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, కమ్మగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ తేనె మిఠాయిలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. అందరికి ఎంతగానో నచ్చే ఈ తేనె మిఠాయిలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె మిఠాయి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – పావు కప్పు, బియ్యం -ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, వంటసోడా – పావు టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, పంచదార – రెండు కప్పులు, నీళ్లు – ముప్పావు కప్పు, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.

తేనె మిఠాయి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపగుళ్లు, బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి గట్టిగా ఉండేలా తక్కువ నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, వంటసోడా, ఫుడ్ కలర్ వేసి బాగా బీట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కొద్దిగా జిగురుగా అయ్యేలా మరో రెండు నిమిషాల పాటు మరిగించి నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని చిన్న చిన్న గోళీల ఆకారంలో నూనెలో వేసుకోవాలి.
తరువాత వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని నూనె నుండి తీసి వేడి వేడి పంచదార పాకంలో వేసి మూత పెట్టాలి. వీటిని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత పాకం నుండి బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తేనె మిఠాయిలు తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇంట్లోనే ఎంతో రుచికరమైన తేనె మిఠాయిలను తయారు చేసుకుని తినవచ్చు.