Masala Tea : మనలో చాలా మంది టీని ఇష్టంగా తాగుతారు. టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదని చెప్పవచ్చు. అయితే తరుచూ ఒకేరకం టీ కాకుండా కింద చెప్పిన విధంగా మసాలా టీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మసాలా టీని తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ టీని తాగడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ మసాలా టీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 3 కప్పులు, నీళ్లు – అర కప్పు, టీ పొడి – 3 టీ స్పూన్స్, పంచదార – 4 టీ స్పూన్స్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు -ఒక టేబుల్ స్పూన్, లవంగాలు -అర టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, సోంపు గింజలు – ఒక టేబుల్ స్పూన్, శొంఠి – చిన్న ముక్క, అతి మధురం ముక్క – 2 ఇంచుల ముక్క, ఎండిన దేశీ గులాబి రేకులు – కొద్దిగా.
మసాటా టీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు గింజలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత శొంఠి, అతి మధురం వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి అందులోనే గులాబి రేకులు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. పొడిని గాలి తగలకుండా మూత ఉండే డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు టీ తయారు చేసుకోవడానికి గానూ గిన్నెలో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరిగిస్తూ ఉండాలి. పాలు మరుగుతుండగానే మరో గిన్నెలో నీళ్లు, టీ పౌడర్ వేసి వేడి చేయాలి.
తరువాత పంచదార వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత పాలు పోసి కలపాలి. ఈ టీ మీగడ కట్టకుండా గంటెతో పైకి కిందికి పోస్తూ బాగా కలపాలి. టీ చక్కగా మరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని పావు టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. ఈ టీని మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీని వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.