Usirikaya Nilva Pachadi : మనం సంవత్సరానికి సరిపడా వివిధ రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం తయారు చేసే నిల్వ పచ్చళ్లల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా చక్కగా ఉంటుంది. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ పచ్చడిని మనం మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలను తొక్కుగా చేసి దానితో కూడా మనం నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసే పచ్చడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పచ్చడి పెట్టడం రాని వారు కూడా పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా ఉండే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరికాయలు – పావుకిలో, వెల్లుల్లి రెబ్బలు – 12, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – 30 గ్రా., కారం – 40 గ్రా., వేయించిన మెంతుల పిండి – అర టీస్పూన్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 300 ఎమ్ ఎల్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 3, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఇంగువ – పావు టీ స్పూన్.
ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసుకుని లోపల ఉండే గింజలను తీసివేయాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, మెంతుల పిండి, నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఇంగువ వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అన్నంతో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.