Instant Guntha Ponganalu : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అనేక రకాల అల్పాహారాలను, స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. ఇలా రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గుంత పొంగనాలు కూడా ఒకటి. సాధారణంగా గుంత పొంగనాలను దోశ పిండితో తయారు చేస్తారు. కేవలం దోశపిండితో కాకుండా రవ్వతో కూడా ఈ పొంగనాలను తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని 10 నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట ఏం చేయాలో తోచనప్పుడు ఇలాఅప్పటికప్పుడు రవ్వతో పొంగనాలను తయారు చేసుకోవచ్చు. రవ్వతో ఇన్ స్టాంట్ పొంగనాలను ఎలా తయారు చేసుకోవచ్చు… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ గుంత పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నటి బొంబాయి రవ్వ – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, చిన్నగా తరిగిన టమాట చిన్న టమాట – 1, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు- తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, పెరుగు – అరకప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – కొద్దిగా.
ఇన్ స్టాంట్ గుంత పొంగనాల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. రవ్వను 5 నిమిషాల పాటు నానబెట్టిన తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని రవ్వ మిశ్రమంలో కలపాలి. తరువాత మరికొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత పొంగనాల గిన్నెలో నూనెలో వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ మిశ్రమాన్ని వేసి వేసుకోవాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మరో వైపుకు తిప్పుకోవాలి. మరికొద్దిగా నూనె వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ పొంగనాలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా తయారు చేసిన పొంగనాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.