Methi Aloo Paratha : మేథీ ఆలూ పరాటా.. మెంతికూర, బంగాళాదుంపలతో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం ఆలూ పరాటాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పరాటాలను మెంతికూరతో తయారు చేస్తున్నాము కనుక వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ మేథీ ఆలూ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేథీ ఆలూ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, తరిగిన మెంతిఆకు – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా.
ఆలూ స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3, అటుకులు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – అర అంగుళం ముక్క, పచ్చిమిర్చి – 4, ధనియాలు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వాము – అర టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
మేథీ ఆలూ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతి ఆకులు, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత అటుకులను జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని బంగాళాదుంప మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ధనియాలు వేసి మిక్సీపట్టుకుని ఆలూ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, వాము, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
తరువాత ముందుగా కలిపిన పిండిని తీసుకుని పూరీలా వత్తుకోవాలి. తరువాత అందులో ఆలూ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ పరోటాలా వత్తుకోవాలి. ఈ పరోటాలను గుండ్రంగానే కాకుండా మనకు నచ్చిన ఆకారంలో కూడా వత్తుకోవచ్చు. పరోటాలను వత్తుకున్న తరువాత వీటిని వేడి వేడి పెనంమీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మూథీ ఆలూ పరాటా తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా రైతా, టమాట చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మేథీ ఆలూ పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.