Chicken Curry With Gravy : చికెన్ తో ఎక్కువగా మనం కర్రీని తయారు చేస్తూ ఉంటాము. చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కర్రీని వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా, రుచిగా, సులభంగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, నిమ్మరసం – అర చెక్క, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, యాలకులు – 3, లవంగాలు – 4, దాల్చిన చెక్క – 2 చిన్న ముక్కలు, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, పెరుగు – ముప్పావు కప్పు, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా లేదా చికెన్ మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – ఒకటి నుండి ఒకటిన్నర కప్పు.
చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ లో నిమ్మరసం, ఉప్పు కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.
దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి.తరువాత మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా చాలా సులభంగా, రుచిగా చికెన్ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు.