Vegetable Soup : వెజిటేబుల్ సూప్.. ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. స్టాటర్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ వెజ్ టేబుల్ సూప్ ను మనం కూడా చాలా రుచిగా, అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆకలి తక్కువగా ఉన్నప్పుడు, గొంతునొప్పి, జ్వరం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఇలా వెజిటేబుల్ సూప్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. రుచిగా, సులభంగా అందరికి నచ్చేలా వెజిటేబుల్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బటర్ – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – చిన్నది ఒకటి, తురిమిన క్యారెట్ – చిన్నది ఒకటి, చిన్నగా తరిగిన బీన్స్ – 5 లేదా 6, సన్నగా తరిగిన క్యాబేజి తురుము – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నీళ్లు – అర లీటర్, క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
వెజిటేబుల్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, బీన్స్ తరుగు, క్యాబేజి తురుము, క్యాప్సికం తరుగు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని కొద్దిగా చిక్కబడే వరకు మరిగించిన తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా చాలా సులభంగా ఇంట్లోనే వెజ్ సూప్ ను తయారు చేసి తీసుకోవచ్చు.