Gobi Manchurian Recipe : మనకు రెస్టారెంట్ లలో,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే వాటిలో గోబి మంచురియా కూడా ఒకటి. గోబి మంచురియా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ గోబి మంచురియాను మనం కూడా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో లేదా స్నాక్స్ తినాలనిపించినప్పుడు మనం గోబి మంచురియాను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గోబి మంచురియాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోబి మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ ముక్కలు – 400గ్రా., మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు – 3, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు – 2 టీ స్పూన్స్, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి -అర టీ స్పూన్, అరోమేటిక్ పౌడర్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన స్స్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
గోబి మంచురియా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత క్యాలీప్లవర్ ముక్కలు వేసి 70 శాతం ఉడికించాలి. తరువాత వీటిని తీసి చల్లటి నీటిలో వేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసుకోవాలి. తరువాత నీటిని చల్లి పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు టాసింగ్ కు కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగు వేసి పెద్ద మంటపై వేయించాలి.
ఇవి వేగిన తరువాత టమాట సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి కలపాలి. తరువాత 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, అరోమేటిక్ పౌడర్ వేసి కలపాలి. తరువాత క్యాలీప్లవర్ ముక్కలు వేసి సాసెస్ అంతా ముక్కలకు పట్టేలా బాగా టాస్ చేసుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోబి మంచురియా తయారవుతుంది. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.