Warm Water Drinking : మనలో చాలా మందికి గోరు వెచ్చని నీటిని తాగే అలవాటు ఉంది. అలాగే కొందరు వేడి నీటిని కూడా తాగుతూ ఉంటారు. సాధారణ నీరు, చల్లటి నీటికి బదులుగా చాలా మంది వేడి నీటిని తాగుతూ ఉంటారు. పిల్లలకు కూడా వేడి నీటినే తాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది నీటిని వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. చలి నుండి ఉపశమనానికి అలాగే చలికాలంలో వచ్చే కఫం, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని పొందడానికి ఈ వేడి నీరు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే వేడి నీటిని తాగడం వల్ల మనం కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని అసలు ఎవరు తాగాలి..? వేడి నీటిని తాగడం వల్ల ఏయే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నీళ్ల విరోచనాలతో బాధపడే వారు, వాంతులతో బాధపడే వారు, గొంతు ఇన్పెక్షన్ తో బాధపడే వారు, టాన్సిల్స్ సమస్యతో బాధపడే వారు, సైనస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు నీటిని కాచి మరిగించి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనం తాగే నీటిలో ఉండే క్రిములు నేరుగా ఇన్పెక్షన్ కు గురి అయిన భాగాల మీద దాడి చేసి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. కనుక ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నీటిని మరిగించి నిల్వ చేసుకోవాలి. అలాగే ఈ నీటిని మరలా తాగేటప్పుడు వేడి చేసుకుని తాగాలి. నీటిని తాగినప్పుడల్లా ఇలా వేడి చేసుకుని తాగడం వల్ల సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా గొంతు ఇన్పెక్షన్, సైనస్, టాన్సిల్స్, నీళ్ల విరోచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వేడి నీటిని కప్పులో పోసుకుని కాఫీ తాగినట్టు తాగాలి. ఇలా తాగడం వల్ల సమస్యలు త్వరగా తగ్గుతాయి.
వీటితో పాటు ప్రేగు పూతలు, అల్సర్లు, ఆస్థమా, తుమ్ములు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు నీటిని గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిది. అలాగే గ్యాస్ సమస్యతో బాధపడే వారు కూడా వేడి నీటిని తాగడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. నీటిని గోరువెచ్చగా చేసుకుని కాఫీ తాగినట్టు కొద్ది కొద్దిగా తాగడం వల్ల గ్యాస్ త్వరగా బయటకు పోతుంది. అదే విధంగా వేసవికాలం తప్ప మిగిలిన అన్ని కాలాల్లో నీటిని వేడి చేసి తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్దకం సమస్యతో బాధపడే వారు కూడా రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల సుఖ విరోచనం అవుతుంది. అలాగే కొందరిలో రోజూ ఉదయం పూట మాత్రమే గొంతు పట్టేసినట్టుగా ఉంటుంది. అలాంటి వారు కూడా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈవిధంగా ఇటువంటి సమస్యలతో బాధపడే వారు వేడి నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.