Vitamin D Foods For Knee Pains : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. సూర్యరశ్మి నుండి విటమిన్ డి మన శరీరానికి లభిస్తుందని మనందరికి తెలుసు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో విటమిన్ డి చాలా అవసరం. అయితే చాలా మందికి తగినంత విటమిన్ డి లభించడం లేదు. చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. చాలా మందికి వారికి విటమిన్ డి లోపం ఉందని కూడా తెలియడం లేదు. దీంతో విటమిన్ డి లోపాన్ని గుర్తించలేక చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ లోపం ఇలాగే పెరిగే కొద్ది మోకాళ్ల నొప్పులతో పాటు మోకాళ్లు వంగిపోవడం కూడా జరుగుతుంది. దీనికి కారణం విటమిన్ డి లోపం అని కూడా చాలా మంది గుర్తించలేరు.
దీర్ఘకాలిక విటమిన్ డి లోపం వల్ల మోకాళ్లు వంగిపోవడం జరుగుతుంది. ఇలా మోకాళ్లు వంగిపోవడం, విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ముందుగా విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుడు సూచించినట్టు వారానికి ఒక విటమిన్ డి క్యాప్సుల్ ను వేసుకుంటూ ఉండాలి. అలాగే మోకాళ్ల నొప్పులు తగ్గే వరకు, మోకాళ్లు తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు కఠినమైన ఆహార నియమాలను పాటించాలి. రోజూ ఉదయం 10 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నీటిని తాగుతూ ఉండాలి. అలాగే కూర్చుని చేసే మోకాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. ఉదయం 10 గంటలకు వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఉదయం 11. 30 సమయంలో ఉప్పు లేకుండా పుల్కాలను ఎక్కువ కూరలతో తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో రోజూ ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.
ఇక సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీటిని తాగుతూ ఉండాలి. సాయంత్రం 4 గంటలకు ఫ్రూట్ జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లు వంటి వాటిని తీసుకోవాలి. ఇక సాయంత్రం 6 గంటల లోపు మొలకెత్తిన విత్తనాలను, పండ్ల ముక్కలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి మినరల్స్ ఎక్కువగా అందుతాయి. దీంతో కండరాలు బలంగా తయారవుతాయి. నొప్పులు తగ్గుతాయి. శరీర బరువు తగ్గుతుంది. దీంతో మోకాళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ సమయంలో క్యాల్షియం కూడా శరీరానికి చాలా అవసరం. కనుక మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక నువ్వుల ఉండను తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నొప్పులు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆవ నూనెలో ముద్ద కర్పూరం వేసి కరిగించి ఈ నూనెను మోకాళ్లపై రాసుకోవాలి. తరువాత వేడి నీటితో కాపడం పెట్టాలి. ఇలా కఠినమైన ఆహార నియమాలను కనీసం రెండు నుండి మూడు నెలల పాటు పాటించడం వల్ల విటమిన్ డి లోపం వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులు, మోకాళ్లు వంగిపోవడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.