మనం ఇంటి పెరట్లో అందం, అలంకరణ కోసం పెంచుకునే పూల మొక్కల్లో మందార మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మన అందరికీ సుపరిచితమే. దీనిని చైనా హైబిస్కస్, చైనా రోస్ అనే పేర్లతో పిలుస్తారు. మందార మొక్కల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. మందార పువ్వులను మనం దేవుడి పూజలో కూడా ఉపయోగిస్తాం. ఈ పూలను స్త్రీలు జడలో కూడా ధరిస్తారు. కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా మందార పువ్వులను ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. మందార పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. మందార పువ్వులే కాకుండా మందార చెట్టు ఆకులు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మందార చెట్టును సౌందర్య పోషణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కేశాల సంరక్షణ కోసం దీనిని ఎక్కువగా వాడతారు. కొబ్బరి నూనెలో మందార పూలను వేసి వేడి చేయాలి. ఈ నూనెను చల్లారిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. దీనిని తరచూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.
మందార పువ్వు పుప్పొడి కాడలను నూనెలో వేసి వేయించి ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు సమస్యలతో బాధపడే వారు మందార పువ్వులను ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తలకు పట్టించి అర గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఈ మందారపువ్వుల పొడిని నీటిలో వేసి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఒక గ్లాస్ నీటిలో 3 మందార పువ్వులను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి కొద్దిగా తేనెను కలిపి తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మందార టీ ని తాగడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు, బీపీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మందారంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి వాటితోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలకు మందార పవ్వులు ఎంతో చక్కగా పనిచేస్తాయి.
మందార పూల రెబ్బలను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి తాగడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మందారంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. మందార పువ్వులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట లేపనంగా రాసి అరగంట తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్య రాకుండా ఉంటుంది.
మందార చెట్టు ఆకులను మెత్తగా నూరి గాయాలపై ఉంచి కట్టుకట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. మందార పువ్వు మలేషియా దేశం జాతీయ పుష్పం. కొన్ని దేశాలలో మందార పువ్వులను సలాడ్ లలో, సూప్ లలో కూడా వేసుకుంటారు. మందార పువ్వులను, ఆకులను ఈ విధంగా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంతోపాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.