మైసూరు రాజ్యంలో గంధపు చెట్లు చాలా ఎక్కువ. గంధపు చెక్కలు, దుంగలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేది. టిప్పు సుల్తాన్ కాలం నుంచే గంధపు చెక్కలను చైనా వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. 20వ శతాబ్దం నాటికి మైసూర్ రాజ్యపు గంధపు చెక్కలకు యూరప్ పెద్ద మార్కెట్‌గా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలకు మైసూరు రాజ్యం నుంచి గంధపు చెక్కలు ఎగుమతి అయ్యేవి. 1914లో తొలి ప్రపంచయుద్ధం మొదలు కావడంతో సముద్ర మార్గాల్లో ఇబ్బందుల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దాంతో చాలా దేశాలు దిగుమతులను ఆపివేయడం వల్ల మైసూరు గంధపు చెక్కలకు డిమాండ్ పడిపోయింది. మరోవైపు రాజ్యంలో వాటి నిల్వలు పేరుకు పోయాయి.
నాడు మైసూర్ రాజ్యాన్ని కృష్ణరాజ వడియార్-4 పాలిస్తున్నారు. ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నాడు దివాన్‌గా ఉన్నారు. పేరుకుపోయిన గంధపు చెక్కల నుంచి ఆయిల్ తీసే మార్గాలను ఆలోచించమని విశ్వేశ్వరయ్యను రాజు అడిగారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సహాయంతో గంధపు చెక్కల నుంచి నూనెను తీసే యంత్రాన్ని తయారు చేయించారు విశ్వేశ్వరయ్య. అలా 1916లో మైసూరులో తొలి శాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. శాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన కాలంలోనే ఒకసారి విదేశీయులు కృష్ణరాజ వడియార్-4ను చూడటానికి వచ్చారంట. మైసూరు రాజ్యంలోని గంధపు చెక్కల నుంచి తీసిన నూనెతో తయారు చేసిన సబ్బులను ఆయనకు బహుమతిగా ఇచ్చారనే కథ ఒకటి ప్రచారంలో ఉంది.
ఆ సబ్బులను చూసిన రాజుకు, గంధపు నూనెతో సబ్బులు తయారు చేయాలనే ఆలోచన వచ్చిందంట. అలా బెంగళూరులో కబ్బన్ పార్కు వద్ద 1918లో మైసూర్ సోప్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అలా మైసూర్ శాండల్ సబ్బుల తయారీ ప్రారంభమైంది. ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చాక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు కంపెనీలను కలిపి, 1980లో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్‌గా పేరు పెట్టింది. 2006లో మైసూర్ శాండల్ ఆయిల్‌కు, సబ్బుకు జియోగ్రాఫిల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. సాధారణంగా గంధపు నూనె కోసం కనీసం 15ఏళ్ల వయసు ఉన్న చెట్లను ఎంచుకుంటారు. 15 నుంచి 25ఏళ్ల వయసు ఉండే చెట్ల నుంచి నాణ్యమైన నూనె వస్తుంది. చెట్ల వయసు పెరిగే కొద్దీ నూనె క్వాలిటీ పెరుగుతుంది. మైసూర్ శాండల్ విషయంలో సుమారు 40ఏళ్ల వయసున్న చెట్లను ఎంచుకుంటారు.
ఎండిన గంధపు దుంగల నుంచి హార్ట్‌వుడ్, శాప్‌వుడ్‌లను వేరు చేస్తారు. దుంగ మధ్యలో గోదుమ రంగులో ఉండే ప్రాంతాన్ని హార్ట్‌వుడ్ అంటారు. దీని నుంచి అత్యంత నాణ్యమైన నూనె వస్తుంది. గోదుమ రంగు ప్రాంతం చుట్టూ తెల్లగా ఉండే దాన్ని శాప్‌వుడ్ అంటారు. దీన్ని నుంచి తక్కువ నాణ్యత గల నూనె వస్తుంది. యంత్రాలు లేదా చేతితో గంధపు దుంగలను చీల్చి హార్ట్‌వుడ్, శాప్‌వుడ్‌లను వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన సేకరించిన గోదుమ రంగు (హార్ట్‌వుడ్) చెక్కలను మరొక మెషిన్‌లో వేసి చిన్నచిన్న ముక్కలు చేస్తారు. ఈ ముక్కలను ఇంకో మెషిన్‌లో వేసి సన్నని పొడిలా చేస్తారు. గంధపు చెక్కల పొడిని బాయిలర్స్‌లో వేసి వేడి చేస్తారు. గంధపు చెక్కల పొడిలోని నూనె నీటి ఆవిరితో కలిసి బాయిలర్స్ పైన ఉండే గొట్టాల నుంచి బయటకు వస్తుంది.
ఒక ట్యాంకులో ఆ ఆవిరిని పట్టి చల్లబరుస్తారు. అప్పుడు ఆవిరి కాస్త నీరుగా మారుతుంది. ఆవిరితోపాటు వచ్చిన గంధపు నూనె ఆ నీటి మీద తేలుతుంది. నీటి మీద తేలాడే నూనెను వేరు చేస్తారు. దీన్ని ముడి గంధపు నూనె అంటారు. అంటే అందులో ఇంకా కొంత నీరు, మలినాలు కలిసి ఉంటాయి. ముడి గంధపు నూనె నుంచి నీటిని, మలినాలను తొలగించిన తరువాత స్వచ్ఛమైన గంధపు నూనె లభిస్తుంది. దీంతో సబ్బులను తయారు చేస్తారు. అయితే సపోనిఫికేషన్ వల్ల కాలుష్యం ఎక్కువగా విడుదలవుతోందని, అందువల్ల ప్రస్తుతం నేరుగా సోప్ నూడుల్స్ కొనుగోలు చేసి, వాటితో సబ్బును చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
మైసూర్ శాండల్ సబ్బు పేరు వినగానే మనకు దాని లోగో గుర్తుకు వస్తుంది. సింహం శరీరం, ఏనుగు తల ఉండే ఆ జీవిని శరభ అంటారు. హిందూ పురాణాల్లో జ్ఞానం, ధైర్యం, బలానికి ప్రతీకగా దాన్ని పేర్కొన్నారు. అందువల్ల దాన్ని లోగోగా ఎంచుకున్నట్లు కంపెనీ చెబుతోంది. కర్ణాటక ప్రభుత్వ చిహ్నంలోనూ శరభ అనే జంతువు ఉంటుంది. నాడు సబ్బులన్నీ బార్ ఆకారంలో వచ్చేవి. దానికి భిన్నంగా ఒవెల్ ఆకారంలో మైసూర్ శాండిల్ సబ్బును తీసుకొచ్చారు. ఇక మైసూర్ శాండల్ సబ్బు అట్టపెట్టె కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని జువెల్ బాక్స్ మాదిరిగా డిజైన్ చేశారంట. దీర్ఘచతురస్రాకరంలో ఉండే పెట్టె మీద ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది.