Marriage : మన దేశంలో పెళ్లిళ్లు చేసుకునే జంటలు అయితే తమ అభిరుచులు, ఇష్టాలకు అనుగుణంగా తమ తాహతుకు తగినట్టుగా దుస్తులు కొని వేసుకుంటారు. పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే విదేశాల్లో ఇందుకు పూర్తిగా భిన్నం. అంటే.. వారు దుస్తులు కొంటారు కానీ.. అవి తెలుపు రంగువే అయి ఉంటాయి. ఏ వర్గానికి చెందిన వారు అయినా, పేదలైనా, ధనికులైనా తెలుపు రంగు దుస్తులను వేసుకునే వివాహం చేసుకుంటారు. అదీ ముఖ్యంగా పెళ్లి కూతురు కచ్చితంగా తెలుపు రంగు దుస్తులను ధరిస్తుంది. ఆ తరువాతే వివాహం చేసుకుంటారు. అయితే వారు ఇలా పెళ్లిలో తెలుపు రంగు దుస్తులనే ఎందుకు వేసుకుంటారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
విదేశీ మహిళలు పెళ్లిళ్లలో తెలుపు రంగు దుస్తులను వేసుకునే సాంప్రదాయం 1840వ సంవత్సరంలో మొదలైందని చెప్పవచ్చు. అప్పట్లో క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్‌ల వివాహం జరిగింది. అయితే తన పెళ్లి సందర్భంగా క్వీన్ విక్టోరియా తెలుపు రంగు డ్రెస్ వేసుకుంది. దీంతో చాలా మంది ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఇక మిగిలిన వారు కూడా అలా తెలుపు రంగు డ్రెస్ ను వేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం మొదలు పెట్టారు. అలా ఆ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
అయితే తెలుపు రంగు డ్రెస్‌నే వధువు వేసుకునేందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. దీంతో పెళ్లి చేసుకునే వారు కూడా మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా అలా స్వచ్ఛంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇక ఇందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే.. తెలుపు కొత్త జీవితానికి సూచిక. ప్రశాంతంగా జీవించాలనే విషయాన్ని చెబుతుంది. అందుకనే పెళ్లి చేసుకునే దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ప్రశాంతంగా జీవించాలనే విషయాన్ని తెలియజేసేందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. దీంతోపాటు వివాహ వేడుకలో అందరికన్నా ప్రత్యేకంగా వధువు కనిపించాలనే ఉద్దేశంతోనే అలా తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇవీ.. ఆ దుస్తులను ధరించడం వెనుక ఉన్న అసలు కారణాలు.