భారతీయులు తరచూ తాము చేసే అనేక రకాల వంటల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔషధ విలువలు ఉంటాయి. అందువల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య సమస్యలకు పనిచేస్తుంది. కుంకుమ పువ్వు నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుంకుమ పువ్వు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల చర్మం మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్లను (విష పదార్థాలను) బయటకు పంపుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టం నివారించబడుతుంది. కుంకుమ పువ్వు నీళ్లను తాగడం వల్ల చర్మం తేమగా, మృదవుగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
2. రుతు సమయంలో విపరీతంగా రక్త స్రావం అయ్యే మహిళలు కుంకుమ పువ్వు నీళ్లను తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. హార్మోన్లు సమతుల్యం అవుతాయి.
3. ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లను తాగడం వల్ల శరీరానికి ఉత్సాహం వస్తుంది. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
4. జుట్టు రాలే సమస్య ఉన్నవారికి కుంకుమ పువ్వు మేలు చేస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. దీంతో జుట్టు పెరుగుతుంది.
5. కొందరికి తీపి తినకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకని వారు రోజూ తీపి పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. ఇలా తినడం మంచిది కాదు. ఈ అలవాటును మానుకోవాలి. అందుకు గాను కుంకుమ పువ్వు నీళ్లను తాగాలి. దీని వల్ల తీపి పదార్థాలను తినాలనే యావ తగ్గుతుంది.
కుంకుమ పువ్వు నీళ్లను తయారు చేసే విధానం
5 నుంచి 7 కుంకుమ పువ్వు పోగులను తీసుకుని గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. దీంతో కుంకుమ పువ్వు నీళ్లు తయారవుతాయి. వాటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. రోజూ ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో మంచి ఫలితాలు వస్తాయి.