సాధారణంగా హిందువులు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పూజలో ఉపయోగించే వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి. పువ్వులు లేకుండా ఎవరు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. పూజలో పువ్వులకు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పూజకు తప్పనిసరిగా పువ్వులు అవసరమా ? పూజలో పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ చేసే సమయంలో ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో స్వామివారికి పుష్పం లేదా ఫలం లేదా నీటిని సమర్పిస్తారో వారి నైవేద్యాన్ని భగవంతుడు తృప్తి చెంది స్వీకరిస్తాడని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు. ఈ క్రమంలోనే భగవంతుడిని పూజించే వారు నిష్కల్మషమైన మనసుతో పూజ చేయటం వల్ల భగవంతుడు వారి వెన్నంటే ఉండి కాపాడుతాడు. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు తన అర్చనలో భాగంగా పూలను చేర్చాడంటే పూజలో పువ్వులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది.
స్వామివారి పూజకు ఉపయోగించే పుష్పాలు ఎంతో శుభ్రమైనవి, సువాసన భరితమైనవి అయ్యుండాలి. పూజకు ఉపయోగించే పూలను పురిటివారు, మైలవారు, బహిష్టులైన స్త్రీలు తాకకూడదు. అలాంటి వారు తాకిన పుష్పాలను పూజకు ఉపయోగించకూడదు. అదేవిధంగా కింద పడిన పువ్వులు, ముళ్ళు కలిగిన పువ్వులు, దుర్గంధ భరితమైన వాసన వెదజల్లే పుష్పాలను కూడా పూజకు ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.