Krishna With Cooling Glasses : తెలుగు సినీ రంగంలో కృష్ణ అంటే ఒక నట శిఖరం. అనేక హిట్ చిత్రాలలో ఆయన నటించి సూపర్ స్టార్ అయ్యారు. ముఖ్యంగా ఆయన చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అంతేకాకుండా కౌబాయ్ సినిమాలను కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు. తెలుగు జేమ్స్ బాండ్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే అలాంటి ప్రముఖ నటున్ని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. అయితే కృష్ణ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి కృష్ణ నల్ల కళ్లద్దాలను ధరించడం. కృష్ణ ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చినా కూలింగ్ గ్లాసులతో కనిపిస్తారు. అయితే ఆయన కూలింగ్ గ్లాస్ లను ధరించడం వెనుక ఒక కారణం ఉంది. ఈ విషయాన్ని విజయ నిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఏ పబ్లిక్ మీటింగ్ కు వెళ్లినా కృష్ణ వెంట తాను కూడా ఎందుకు వెళ్తుందో విజయ నిర్మల ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనను కాపాడుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చిందని విజయ నిర్మల అన్నారు. ఎక్కడైనా ఆడవాళ్లు కనిపించారంటే కృష్ణకి కూలింగ్ గ్లాసులు వేస్తానని అన్నారు. దానికి కారణం ఎవరైనా ఆడవాళ్ల కళ్లలోకి చూస్తే కృష్ణ చాలా ఇబ్బందిగా ఫీలవుతారని చెప్పారు.
వారి కళ్లలోకి నేరుగా కృష్ణ చూడలేరని.. అందుకే అలా కూలింగ్ గ్లాసులు పెట్టేదాన్ని అని విజయనిర్మల తెలిపారు. అంతే కాకుండా చెన్నై లోని మీసాల కృష్ణుడు దేవాలయంలో ఓ పాట షూటింగ్ పూర్తిచేసుకుని బయటకు వచ్చినప్పుడు ఆసక్తికర ఘటన జరిగిందని చెప్పారు. అప్పుడు గుడి బయట ఉన్న కమెడియన్ రాజబాబు.. తమను చూసి ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇక్కడ షూటింగ్ లో పెళ్లి చేసుకున్న వాళ్లంతా నిజంగా పెళ్లి చేసుకున్నారు అని జోస్యం చెప్పారని అన్నారు. చివరికి తమ విషయంలోనూ అదే నిజమైందని విజయనిర్మల తెలిపారు. అయితే విజయ నిర్మల తరువాత కొన్ని రోజులకు ఇందిర చనిపోవడం కృష్ణను కలచివేసింది. అలాగే రమేష్ బాబును కూడా కోల్పోయారు. ఈ క్రమంలోనే వారు చనిపోయాక చాలా త్వరగా కృష్ణ మృతి చెందారు. దీంతో ఆయన ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు.