Tirumala : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా మతాలకు చెందిన ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న రెండో పుణ్య క్షేత్రం తిరుమల. మొదటి స్థానంలో వాటికన్ సిటీ ఉంది. అయితే తిరుమలకు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గూర్చి అందరికీ తెలుసు. అక్కడ ఏడుకొండల్లో కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని సమస్యలు పోయి, కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడైతే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం రోజుకు కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది.
అయితే వెంకటేశ్వర స్వామికి అంతటి ఆదాయం వస్తుండడాన్ని పక్కన పెడితే ఆయనను భక్తులు రెండు పేర్లతో పిలుచుకుంటారు. అది ఒకటి ఆపదమొక్కుల వాడని, ఇంకోటి వడ్డీ కాసుల వాడని. కోరిన కోర్కెలు తీర్చి, ఆపదల నుంచి గట్టెక్కించి, అంతా శుభమే కలిగించే వాడు కావడం వల్ల ఆయనకు ఆపద మొక్కుల వాడని పేరు వచ్చింది. అయితే వడ్డీ కాసుల వాడనే పేరు రావడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీ దేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ క్రమంలో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్లికయ్యే ధనం మొత్తం ఇచ్చాడట. ఒక సంవత్సరంలోగా ఆ అప్పు తీరుస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పాడట. అయితే తీరా సంవత్సరం దాటే సరికి వెంకటేశ్వర స్వామి ఆ ధనం అప్పు తీర్చకుండా వడ్డీ కడతాడట. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగీ పెరిగీ చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుందట. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నాడట. అందుకే ఆయనకు వడ్డీ కాసుల వాడని పేరు వచ్చింది.