Green Moongdal : మనకు తింటానికి అందుబాటులో ఉన్న అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెసలు కూడా ఒకటి. వీటిని మొలకెత్తించి తినవచ్చు లేదా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ల రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా మనకు అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెసల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం పెసలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెసలను తినడం వల్ల మన శరీరానికి ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ బి1, పాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియం, జింక్, విటమిన్ బి2, బి3, బి5, బి6, సెలీనియంలు లభిస్తాయి. దీని వల్ల మనకు పోషణ అందుతుంది. పెసల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ఐరన్ రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. పొటాషియం గుండె సమస్యలు రాకుండా చూస్తుంది.
పెసలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల మనకు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో వచ్చే దగ్గు, జులుబు, జ్వరం తదితర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. పెసలను తినడం వల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాల్లో ఇదొకటి. పెసలను తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ విషయం సైంటిస్టుల పరిశోధనల్లోనూ వెల్లడైంది.
పెసల్లో పొటాషియం, మెగ్నిషియం పుష్కలంగా ఉండడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్త నాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు పెసలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. అలాగే గర్భిణీలు నిత్యం పెసలను తింటే ఫోలేట్ బాగా అందుతుంది. తద్వారా బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.