మన దేశంలో 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి అందరికీ తెలిసిందే. దీన్ని చాలా మంది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. దేశంలో బ్రిటిష్ వారి కింద సైనికులుగా పనిచేస్తున్న భారతీయులు పలు కారణాల వల్ల తిరుగుబాటు చేశారు. దీంతో దేశంలోని చాలా ప్రాంతంలో ఉన్న సిపాయిలు ఒక్కటై స్థానిక రాజులు, జమీందార్లతో కలిసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారు. కానీ అది విజయవంతం కాలేదు. బ్రిటిష్ వారికి ఉన్న శక్తివంతమైన ఆయుధాల ముందు మన సిపాయిలు చేసిన పోరాటం వృథా అయింది. అయితే ఆ తిరుగుబాటు సమయంలో లక్నోలో ఓ మహిళ చేసిన పోరాటాన్ని మాత్రం మనం ఎన్నటికీ మరిచిపోలేం.
ఆమె ఉడా దేవి. ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ అనే ప్రాంతంలో ఓ దళిత కుటుంబంలో ఈమె జన్మించింది. చిన్నప్పటి నుంచి ఈమెకు స్వాతంత్ర్యోద్యమ భావాలు ఎక్కువగా ఉండేవి. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చే దిశగా జరిగే కార్యక్రమాల్లో ఈమె తన వంతు పాత్ర పోషించేది. వాటిల్లో పాల్గొని జనాలకు ప్రేరణాత్మకమైన ఉపన్యాసాలు ఇచ్చేది. అయితే ఉడా దేవి యుక్త వయస్సుకు రాగానే ఆమెకు వివాహం చేశారు. కాగా ఈమె భర్త కూడా స్వాతంత్ర్యోద్యమ భావాలను కలిగి ఉండేవాడు. అయితే 1857లో సిపాయిల తిరుగుబాటు అయినప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో అవధ్‌బేగం హజ్రత్‌మహల్ తో కలిసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు.
కాగా బ్రిటిష్ వారి అధునాతన ఆయుధాల ముందు భారత సిపాయిలు, విప్లవ కారులు నిలబడలేకపోయారు. సుమారుగా 2వేల మంది వరకు చనిపోయారు. వారిలో ఉడా దేవి భర్త కూడా ఉన్నాడు. దీంతో తమ వారి మరణాన్ని సహించలేని ఉడా దేవి ఎలాగైనా బ్రిటిష్ వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. లక్నోలో ఉన్న సికందర్ బాగ్‌లోని పెద్దదైన మర్రిచెట్టుపై పురుషుడి వేష ధారణలో దాగి సమయం చూసుకుని తన వద్ద ఉంచుకున్న తుపాకులతో ఏకంగా 30 మంది బ్రిటిష్ సైనికులను హతమార్చింది.
కన్నార్పకుండా పదే పదే తుపాకీ పేలుస్తూ బ్రిటిష్ వారిని నేలమట్టం చేసింది. అయితే మర్రిచెట్టు నుంచి బుల్లెట్లు వస్తున్నాయని గమనించిన బ్రిటిష్ అధికారులు దానిపై దాడి చేశారు. తుపాకులను ఆపకుండా పేల్చారు. ఆ దాడిలో ఉడా దేవి మరణించింది. అయితే ఆమె మరణించినా ఇప్పటికీ ఆమెను అక్కడి వారు స్మరించుకుంటారు. ఆమె స్ఫూర్తిగా ఇప్పుడు అక్కడ చాలా మంది పోలీసు శాఖలో చేరి సేవలు అందిస్తున్నారు. ఏది ఏమైనా ఉడా దేవి ప్రదర్శించిన తెగువ, ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకోకుండా ఉండలేం కదా..! అందుకు ఆమెను అభినందించాల్సిందే..!