శ్రీదేవి.. ఈ పేరు గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అప్పట్లో అగ్ర హీరోలు అందరి పక్కన నటించి నటనలో ఎంతో ఎత్తుకు ఎదిగిన తార ఈమె. కానీ ఈమె మరణం మాత్రం అప్పట్లో అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. అప్పట్లో ఈమె మరణం గురించి ఎంతో చర్చ నడిచింది. అయితే ఈ విషయం పక్కన పెడితే నిజానికి శ్రీదేవికి భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె అనేక భాషల్లో సినిమాల్లో నటించడమే కాదు, తాను నటించిన సినిమాల్లో పాత్రలకు జీవం పోసింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అందుకే ఆమెను సూపర్ స్టార్ అని వ్యవహరిస్తారు.
1990లలో శ్రీదేవి హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిపోయింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో ఈమె అగ్ర స్థానంలో ఉండేది. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13, 1963న జన్మించింది. ఆమె తండ్రి ఒక న్యాయవాది. ఆమెకు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. శ్రీదేవి పెద్దగా చదువుకోలేదు. ఎందుకంటే చిన్న వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే ఆమెను సినీ ప్రపంచం వైపు నడిపించింది. టాప్ హీరోయిన్‌ను చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ తనదైన సత్తా చాటింది. ఎంతో మంది అగ్రశ్రేణి నటులతో కలిసి సినిమాల్లో నటించింది. లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఓ దశలో నటుడు మిథున్ చక్రవర్తిని ఈమె రహస్యంగా వివాహం చేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తరువాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను శ్రీదేవి వివాహం చేసుకుంది.
శ్రీదేవికి భారత ప్రభుత్వం 2013 లో పద్మశ్రీని ప్రదానం చేసింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె అందుకుంది. ఇక ఇదే కాకుండా ఆమె నటనకు అనేక ఇతర అవార్డులను కూడా ఆమె సాధించింది. కాగా శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్‌కు ఇద్దరికీ కలిసి సుమారుగా 35 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంటుందని తెలిసింది. 1980, 90 లలో భారతీయ చిత్ర పరిశ్రమలో శ్రీ దేవి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి అనేక భాషల్లో ఆమె యాక్ట్ చేసింది. ఇక దీంతోపాటు ఆమె హీరోయిన్‌గా నటించిన సమయంలో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. కాగా బోనీకపూర్, శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు. జాహ్నవి, ఖుషి వారి పేర్లు. ఇక జాన్వీ కపూర్ ఇటీవలే దేవర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.